July 28 Telugu Current Affairs

Free Telugu Current Affairs

నాలుగోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప

 • కర్ణాటక 19వ ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప జూలై 26న ప్రమాణస్వీకారం చేశారు.
 • రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్‌వాలా ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
 • కర్ణాటకలో హెచ్.డి.కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన మూడ్రోజులకే యడియూరప్ప ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు.
 • కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న యడియూరప్ప జన్మించారు.
 • 15 ఏళ్ల వయసులోనే ఆరెస్సెస్‌లో చేరిన ఆయన ఆరెస్సెస్ శికారిపుర సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
 • 1980లో బీజేపీలో చేరిన యడ్యూరప్ప 1983 నుంచి శికారిపుర ఎమ్మెల్యేగా ఏడు సార్లు ఎన్నికయ్యారు.
 • యడియూరప్ప 2007 నవంబర్‌లో తొలిసారి సీఎం అయ్యారు.
 • జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో ఆయన ఏడు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.
 • 2008 మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.
 • అక్రమ మైనింగ్ కేసులో లోకాయుక్త యడియూరప్పను దోషిగా తేల్చడంతో మూడేళ్లకే 2011 జులైలో సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వారం రోజులు జైల్లో ఉన్నారు.
 • ఆ తరువాత 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో యడియూరప్ప మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
 • కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తన పేరును మరోసారి మార్చుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు రాసిన లేఖలో తన పేరును ఆయన ‘బీఎస్ యడియూరప్ప’గా రాశారు.

బెజవాడలో మహాత్ముడు పుస్తకావిష్కరణ

 • గాంధీ ఆలయం సహ నిర్మాత, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు రచించిన బెజవాడలో మహాత్ముడు (మన తాతగారికి మా తాత గారు) పుస్తకాన్ని ఆవిష్కరించారు.
 • అమరావతి సచివాలయంలో జూలై 26న జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
 • ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ.. తన తాత గోళ్ల నారాయణరావు గాంధీజీ అనుచరుడని చెప్పారు.
 • 1933లో గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు తమ నివాసంలోనే బస చేశారన్నారు.

పార్లమెంటు పీఏసీ చైర్మన్‌గా అధీర్ రంజన్

 • పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి నియమితులయ్యారు
 • పీఏసీ కమిటీ చైర్మన్ సహా లోక్‌సభ, రాజ్యసభ నుంచి 22 మందిని పీఏసీ సభ్యులుగా ఎంపిక చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 26న ఉత్తర్వులు జారీ చేశారు.
 • మరోవైపు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నియమితులయ్యారు.
 • ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా మీనాక్షిలేఖి వ్యవహరిస్తారు.

అమరావతిలో మహిళల భద్రత సదస్సు

 • అమరావతి సచివాలయంలో జూలై 26న సైబర్ ప్రదేశంలో మహిళల భద్రత(ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్) సదస్సును ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు.
 • సైబర్ సేఫ్టీ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ పుస్తకాన్ని మంత్రి సుచరిత ఆవిష్కరించారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు.

ఆర్టీజీఎస్ సీఈవోగా బాలసుబ్రహ్మణ్యం

 • ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు.
 • వెయిటింగ్‌లో ఉన్న ఆయనను ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా నియమిస్తూఏపీ ప్రభుత్వం జూలై 26న ఉత్తర్వులు జారీ చేసింది.

మార్కెట్ల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

 • ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేలను గౌరవ అధ్యక్షులుగా నియమించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు, పశు సంపద మార్కెట్ల సవరణ బిల్లు-2019ను రాష్ట్ర శాసనసభ జూలై 26న ఆమోదించింది.
 • రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లను పటిష్టం చేయడానికి, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టడానికి ఈ బిల్లు తోడ్పడుతుంది.

కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత

 • కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌. జైపాల్‌రెడ్డి(77) కన్నుమూశారు.
 • ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్‌ ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
 • తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు.
 • జైపాల్‌ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో జైపాల్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది.
 • ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్‌ లిట్‌రేచర్‌లో పట్టా పొందారు.
 • విద్యార్థి దశనుంచి జైపాల్‌రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కాంగ్రెస్‌ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ ఆపార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు.
 • 1985 నుంచి 88 వరకు జనతాపార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
 • ఐదుసార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 • 1969లో తొలిసారి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన జైపాల్‌రెడ్డి .. నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు.
 • 1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
 • 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు.
 • 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
 • జూన్‌ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు.
 • 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.
 • ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
 • మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు.
 • 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు.
 • దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు.

భారత నేవీలోకి ‘ఐఎన్‌ ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ నౌక’

 • భారత నౌకాదళం కోసం గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డింగ్‌లో నిర్మించిన ‘ఐఎన్‌ ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ నౌక’ (ఎల్‌.సి.యు)ను ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌- ఇన్‌- చీఫ్‌ వైస్‌అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ జాతికి అంకితం చేశారు.
 • తీర ప్రాంత రక్షణ, గస్తీ విధుల్లో కీలక పాత్ర పోషించేందుకు అనువుగా నిర్మించిన ఎల్‌సీయూ 62 మీటర్ల పొడవుతో 15 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది.
 • ఈ నౌక రెండు ఎంటీయూ డీజిల్‌ ఇంజిన్లతో పాటు మరో రెండు 30 ఎంఎం తుపాకులను కలిగి ఉంది.
 • నౌకలో నలుగురు అధికారులు, 56 మంది నావికులు, 150 ట్రూపుల దళ సభ్యులు ఉంటారు.
 • తీరం నుంచి నౌకలకు పరస్పరం ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, సిబ్బందిని తరలించేందుకు ప్రయోజనకారిగా ఉంటుందని నేవీ వర్గాలు వెల్లడించాయి.
Please Share