పాన్ కార్డు తీసుకోవాలంటే రెండు పేజీల దరఖాస్తు నింపాలి. ఆ తర్వాత కార్డు కోసం రోజుల తరబడి ఎదురు చూడాలి. ఇది పాత ముచ్చట. ఇప్పుడు పాన్ కార్డు కోసం పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. మీ ఇంట్లోనే కూర్చుని కేవలం పది నిమిషాల్లో పాన్ కార్డు పొందవచ్చు. పాన్ కార్డు ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఆదాయపు పన్ను శాఖ ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నది. ఇన్స్టంట్ పాన్ సౌకర్యం కింద ఆధార్ కార్డు ద్వారా ఇ-పాన్ కార్డు ఇవ్వడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే పడుతుందని ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ తెలిపింది.
సాధారణంగా పాన్ కార్డును ఎస్ఎస్డీఎల్, యూటీఐటీఎస్ఎస్ వెబ్‌సైట్స్ ద్వారా కూడా పొందవచ్చు. అయితే, ఆ సైట్ల ద్వారా పాన్ కార్డు పొందేందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ పోర్టల్ ద్వారా పాన్ కార్డు పొందేందుకు వెబ్సైట్లో ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాం..
దరఖాస్తు ఎలా..?
- ముందుగా ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు చెందిన ఈ ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించాలి.
- ఎడమవైపున ఉన్న క్విక్ లింక్స్‌లో Instant PAN through Aadhaar లింకును క్లిక్ చేయాలి.
- లింక్ ఓపెన్ కాగానే Get New PAN ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- అనంతరం మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుతో అనుసంధానం అయిన ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి, పేజీలో కనిపించే ఆధార్ వివరాలను సరిచూసుకుని ఓకే చేయాలి.
- దాంతో ఆధార్ కార్డుతో ఉన్న మీ ఈ-కేవైసీ డేటా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చేరుతుంది.
- ఆ తర్వాత మీకు ఇన్స్టాంట్ ఈ పాన్ కార్డు కేటాయించబడుతుంది. ఈ ప్రాస్స్ మొత్తం కేవలం 10 నిమిషాల లోపే పూర్తవుతుంది.
- దరఖాస్తు అనంతరం మీకు పీడీఎఫ్ ఫార్మాట్లో పాన్ కార్డ్ లభిస్తుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
- మీ పాన్ కార్డు సాఫ్ట్ కాపీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయిన ఉన్న మీ ఈ-మెయిల్ ఐడీకి కూడా వస్తుంది.